ఏవి....! అప్పటివరకు ఆశల పొదరింట్లో
కువకువ లాడే గువ్వ పిట్ట లేవి ?
బతుకాకాశము మీద విరిసిన హరివిల్లులేవి వర్నాలేవి ?
చైత్రమాసపు వెన్నెల రాత్రుల్లో
చుక్కల ఆకాశాన్ని చూపిస్తూ అతడుచేప్పిన ఊసులూ ,
బుజలమీద గుర్రపుబండేసి తిప్పుతూ
లోకమంతా చుపినతడి జ్ఞాపకాలూ ,
హంసేగిరిపోగానే ఆవిరి అయి పోవటంమేనా!
బతికినన్నాళ్ళు హంసలానే బతికాడు
కావిడి కట్టి కుటుంబాన్ని ఇంతదూరం మోసుకోచ్చాడూ
కాటికికాలూ కూటికి చేతులు చాపే కాలాన
పక్షులన్నీతలోదిక్కుకు ఎగిరిపోతే
దిక్కులు చూస్తూ ఒంటరిమోడులా ...అతడు
శిలువలా బతుకునీడుస్తూ
ఇంకిపోతున్న సాయం సంద్యలా ... అతడు
తలో చెడదు తోడుకుపోతే అతడిప్పుడు
దుఖపు దిగుడుబావిలాకుమిలిపోయాడూ
కెరటాల తాకిడికి శిదిలగర్బగుడిలా కూలిపోయాడు !
మరణించటమంటే .........ఈ లోకంలోంచి
ఓ మనిషి హటాత్తుగా మాయమయ్ పోవటంమేకాదు,
అతనితో పెనవేసుకున్న అన్నిబందాలను
ఒకసారి పునః దర్శనం చేసుకోవాలి
కళ్ళు తుడవాలి, పొలం తడిసినట్లు మనసు తడవాలి
నోట తులసి తీర్థం పోసి పడే మీద ఊరేగించి
కాడువరకు వచ్చిన సమూహమంత ఓ కన్నీటి బోట్టు అవ్వాలి.
చితి మంటల కెరటాల మీద నౌకను సాగనంపాలి
మరి ఏరి ..! ఎవరూ రారేమి ...?
చివరిచూపైన ఓసారి విసిరిపోరేమి ...?
అవునులే ..? ఇపుడిది అనాధ శవం కదా ...?
ఆస్తిలేని శవం కదా !
మనిసి మనిషిని గాక వస్తువిని ప్రేమించినప్పుడీ
మానవబందాలకు కాలం చేల్లిపాయింది
పడగెత్తిన రూపాయి నీడలో ప్పేగుపా శాలు తెగిపోతున్నప్పుడే
దిమ్పుడుకల్లం ఆశాతీరిపాయింది
ఇప్పుడీ పల్లెలూ పట్టణాలు కన్నీటి ద్వీపాలూ
నిరాశ్రిత వృద్ధ పక్షు ల కేంద్రాలు !
వల్లకాటి నిశ్శబ్దం బద్దలయ్యేలా గోల గోల చేస్తూ
సాగే కాకుల గుంపును చూస్తూ .... ఎవరో అన్నారు !
"అక్కడో కాకి చనిపాయింది .
కాకులన్నీ అక్కడ కన్నీటి వీడ్కోలిస్తున్నాయని ..."!!
No comments:
Post a Comment